రాసలీల


మధురోహలతో మనసు
వేణువై పాడదా..
మమత పొంగు నీ మనసు
వెన్నలా కరుగదా..

నేనే నీలుడ.. నీవే నా నీలవేణి..
నే గోపాలుడ.. నీవే నా గొల్లభామ..

అరవిరిసిన అందమంత
వెన్నెలలై కురియదా..
తనువణువూ తపన తీరి
మల్లియలా మురియదా..

మక్కువతో నా మేను
ఆకసమై పొంగదా..
సిగ్గులతో నీ మేను
చుక్కలలా చిందదా..

సత్యం


వటుడింతై ఇంతింతై
పెరిగి పోతున్నాను.

ఓహో! నేనే చక్రవర్తిని!
అందరూ జయ జయ ధ్వానాలు చేస్తున్నారు.

ఓహొ! నేనే ప్రపంచాన్ని
వుధ్దరించె మహా జ్ఞానిని.
అందరూ కీర్తనలు ఆలపిస్తున్నారు.

అంతలోనే చీకటి…
నా చుట్టూ ముసురుకొంది.
భయంతో నేను
వెర్రి పరుగులు తీస్తున్నాను.

నిద్రలో నా శవం నేనే
మోసుకెడుతున్నాను.
నా చితిని నేనే వెలిగిస్తున్నాను.

ఉలిక్కిపడి లేచాను..
చుట్టూ ఎవరూ లేరు..
జయజయ ధ్వానాలు, కీర్తనలూ
అన్నీ కలలోనే పారిపోయాయి.

అద్దంలో నా మొహం నాకే
దెయ్యంలా కనబడుతోంది.

ఇది సత్యం. ఇదే సత్యం.

పండుగలు

పండుగట.. తెల్లారింది.
నాకేం తేడా లేదు.
అవే గోడలు.. కంప్యూటరూ..
అరిచి గోల చేస్తున్న టీవీ.
నా మొహం చూసుకుంటూ నేనూ.

ఏవీ ఆ భోగి మంటలు?
ఏవీ ఆ పిడకల వేటలు?
పోటీలు పడ్డ స్నేహితులు?
అమ్మ వండే పిండి వంటలు?
నాన్న పెట్టే కొత్త బట్టలు?
తిన్నవి చాలక ఇంకా కావాలని
తిన్నదరక్క పెట్టే పేచీలు?

ఏవీ లేవు.. అన్నీ దూరం పారిపోయాయి.
ఏదో సంపాదిచేస్తున్నామని
జీతాలు ఇంతింత పెరిగేస్తున్నాయని
గర్వాలు.. గొప్పలు..
మనుషులు ఇనుప డబ్బాల్లో ఇరుక్కుని
వాళ్ళ మొహం వాళ్ళే చూసి
విర్రవీగుతున్నారు.

ఇంకెందుకీ పండుగలు?
వట్టి దండగలు.