నరక చతుర్దశి


నాయకుల వాగ్దానాలలా వర్షం తడిపేస్తోంది

దేశ రాజకీయాలలా వరద ముంచెత్తుతోంది

నిర్భయ అభయలకు రాక్షసత్వం భయాన్ని నేర్పుతోంది

రక్షణనిచ్చే యంత్రాంగం పడిమేసి నిద్రపోతోంది

ఈ దీపావళికైనా సత్యభామలు మేల్కొని నరకాసుర వధ చేస్తారా !?

రాసలీల


నీ చేయిలోన నా చేయి కలిపి
నీ పదము తోడ నా పదము కదిపి
మన కనులలోన మన ఉనికి చూసి
మన మనసులోన ప్రియ ప్రతిమ జూసి
తళాంగు తకథిమి.. థిమి థిమి తకథిమి…
 
తనువెల్ల ఎగసి మనసేమొ విరిసి
ఆనందడోలికల ఆడేము మురిసి
రసలీల తూలికల తనువెల్ల మరచి
శృంగార భంగిమల సౌందర్యమెగసి
తళాంగు తకథిమి.. థిమి థిమి తకథిమి…

రాసలీల


మధురోహలతో మనసు
వేణువై పాడదా..
మమత పొంగు నీ మనసు
వెన్నలా కరుగదా..

నేనే నీలుడ.. నీవే నా నీలవేణి..
నే గోపాలుడ.. నీవే నా గొల్లభామ..

అరవిరిసిన అందమంత
వెన్నెలలై కురియదా..
తనువణువూ తపన తీరి
మల్లియలా మురియదా..

మక్కువతో నా మేను
ఆకసమై పొంగదా..
సిగ్గులతో నీ మేను
చుక్కలలా చిందదా..

రాసలీల


నిండు పున్నమి రేయి
నిను పిలిచె రావోయి.
నీలమోహన స్వామి
నీ మురళి రవమేది?

రాసలీలలు వేయి
ఆపలేవా స్వామి?
రాధ మది నీదోయి
కోపమేలర స్వామి?

రతికేళి కాంక్షతో
చెంత చేరినదాన్ని
పదివేలు కలరని
అలుసు చూపెదవేమి?

రాసలీల


వలదు వలదన్నా వినక
నా పాదమంటేవు..
ఎంత జాణోయమ్మ
ఈ సత్యభామని
లోకమంతా నన్ను ఆడిపొసేను.

ఎవరికీ తెలియదిది
నేను నీ దాసినని
నీవె నా రేడువని.

పసుపు పారాణిలా
మన ప్రేమ పండెనని.

రాసలీల


మురళీ రవం వినిపించి వినిపించి
మనస్సులో సెగలు రేపుతావెందుకు?

ముందేమో దూరంగా ఉన్నావు.
ఇప్పుడీ సవితిని పెదాలనిడుకుని
నా మనస్సును రగిలిస్తున్నావు.

ఎప్పుడూ మధురంగా కల్లలాడి మైమరిపిస్తావు.
ఎంత కొంటెవాడివి కన్నయ్యా!

రాసలీల


ముఖమలా తిప్పి కూర్చున్నావేం రాధికా?
మనోవేదన ఏంటో చెప్పవా?

నీ హృదయ తాపం నన్ను వేదిస్తోంది.
మరింత వేదించనీయకేం..

బాహ్య ప్రపంచాన్ని మర్చిపో..
కౌగిలిలో బందీవైపో.
కళ్ళల్లో కాపురముండు.
అధర సుధలు చిలికించు.

నా జీవితాన్ని ఒడ్డుకు చేర్చి రక్షించు.

సత్యం


వటుడింతై ఇంతింతై
పెరిగి పోతున్నాను.

ఓహో! నేనే చక్రవర్తిని!
అందరూ జయ జయ ధ్వానాలు చేస్తున్నారు.

ఓహొ! నేనే ప్రపంచాన్ని
వుధ్దరించె మహా జ్ఞానిని.
అందరూ కీర్తనలు ఆలపిస్తున్నారు.

అంతలోనే చీకటి…
నా చుట్టూ ముసురుకొంది.
భయంతో నేను
వెర్రి పరుగులు తీస్తున్నాను.

నిద్రలో నా శవం నేనే
మోసుకెడుతున్నాను.
నా చితిని నేనే వెలిగిస్తున్నాను.

ఉలిక్కిపడి లేచాను..
చుట్టూ ఎవరూ లేరు..
జయజయ ధ్వానాలు, కీర్తనలూ
అన్నీ కలలోనే పారిపోయాయి.

అద్దంలో నా మొహం నాకే
దెయ్యంలా కనబడుతోంది.

ఇది సత్యం. ఇదే సత్యం.

పండుగలు

పండుగట.. తెల్లారింది.
నాకేం తేడా లేదు.
అవే గోడలు.. కంప్యూటరూ..
అరిచి గోల చేస్తున్న టీవీ.
నా మొహం చూసుకుంటూ నేనూ.

ఏవీ ఆ భోగి మంటలు?
ఏవీ ఆ పిడకల వేటలు?
పోటీలు పడ్డ స్నేహితులు?
అమ్మ వండే పిండి వంటలు?
నాన్న పెట్టే కొత్త బట్టలు?
తిన్నవి చాలక ఇంకా కావాలని
తిన్నదరక్క పెట్టే పేచీలు?

ఏవీ లేవు.. అన్నీ దూరం పారిపోయాయి.
ఏదో సంపాదిచేస్తున్నామని
జీతాలు ఇంతింత పెరిగేస్తున్నాయని
గర్వాలు.. గొప్పలు..
మనుషులు ఇనుప డబ్బాల్లో ఇరుక్కుని
వాళ్ళ మొహం వాళ్ళే చూసి
విర్రవీగుతున్నారు.

ఇంకెందుకీ పండుగలు?
వట్టి దండగలు.